జాతీయ యువజన దినోత్సవం మరియు రెడ్ స్టార్ యూత్ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

1984 లో భారత ప్రభుత్వం జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది.  భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించింది ఈరోజే.   యువతలో దాగున్న నిగూఢ శక్తిని వెలికితీయుటకు వివేకానంద గారి రచనలు, ఆలోచనలు  ఎంతో సహకరిస్తున్నాయి. ఆయన విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇంకో విశేషమేమిటంటే ఈరోజు మన రెడ్ స్టార్ రెండవ ఆవిర్భావ దినోత్సవం.

మహా మనిషికి ముందుగా మన రెడ్ స్టార్ యూత్ తరపున జన్మదిన శుభకాంక్షలు.

స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర నాథ్ దత్. ప్రముఖ సాధువు రామకృష్ణ పరమహంస గారి  దగ్గర శిష్యుడిగా చేరారు స్వామీ వివేకానంద. రామకృష్ణ  గారి ప్రభావంతో 25 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకున్నారు. ఆ తరువాత, ఆయన పేరు స్వామి వివేకానందగా మార్చుకున్నారు.

మిగతా శిష్యుల లాగే రామకృష్ణ  గారి దగ్గర అన్ని బోధనలూ, భారతీయ సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, యోగా వంటివి నేర్చుకున్నారు. వాటిని అమెరికా సహా చాలా దేశాలకు వెళ్లి బోధించారు. అలా ఆయన భారత గొప్పదనాన్ని విదేశీయులకు చాటిచెప్పారు.  1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన సదస్సులో  వివేకానందుని  ప్రసంగం  ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత పెద్దల సమక్షంలో వివేకానంద “సోదరీమణులు .. సోదరులు” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు చికాగోలోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌లో కొన్ని నిమిషాల పాటు చప్పట్లతో మోతెక్కింది.

రామకృష్ణ పరమహంస గారు మరణించిన తరువాత  స్వామి వివేకానంద 1897లో కోల్‌కతాలో రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. ఒక సంవత్సరం తరువాత, ఆయన గంగా నది ఒడ్డున బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు.  తన 39వ వివేకానంద  1902 జూలై 04న బేలూరు మఠంలో మరణించారు.

స్వామి వివేకానంద ఆలోచనలు

లేవండి, మేల్కోనండి. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి.

జీవితంలో ఎదగాలంటే మీలోని అహంకారాన్ని వదిలించుకోండి. మీ మనస్సును తేలిక చేసుకోండి. లోపల తేలికగా ఉన్నవారే పైకి ఎదగగలరు.

ఇతరులకు సేవ చేయండి. దానం చేయండి. నిస్వార్థంగా ప్రేమించండి.

తెలివిగా ఖర్చు పెట్టండి. తర్కంతో వాదించండి. క్లుప్తంగా చెప్పండి

స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వలేని సమాజం ఎప్పటికీ పురోగమించదు.

స్వీయ అనుభవమే ప్రపంచంలోని అత్యుత్తమ గురువు.

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.

ప్రతి రోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

నీ వెనుకాల ఏముంది.. ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం.

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.

ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి.

ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.

తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.