వినాయకచవితి శుభాకాంక్షలు

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే !!!


ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటుంటాం. ఇందులో వినాయకుని తత్వం నిక్షిప్తమై ఉంది. ’శుక్లాంబరదరమ్’ అంటే తెల్లని ఆకాశం అని అర్థం. తెలుపు సత్వ గుణానికి సంకేతం. ’శుక్లాంబరధరం విష్ణుం’ అంటే సత్వగుణంతో నిండిన ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ’శశివర్ణం’ అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని అర్థం. ’చతుర్భుజం’ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నవాడని అర్థం. సర్వవిఘ్నాలను పోగొట్టే విఘ్ననివారకునికి మనసారా నమస్కరిస్తున్నానని ఈ శ్లోకం యొక్క అర్థం. విఘ్నాలను తొలగించి సత్వరఫలాన్ని, శుభములనిచ్చే శుభదాయకుడు గణపతి. హిందువులు జరుపుకునే సర్వశుభకార్యాలలోను విఘ్నేశ్వరుకే అగ్రపూజ.

విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున ఈ పండగను నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశేషమైన విశిష్టత వుంది. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. గణనాధుని కృప వుంటే మనకు అన్ని విజయాలే లభిస్తాయి. ఈ పర్వదిన ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. అనేకప్రాంతాల్లో గణపతి నవరాత్రులు నిర్వహిస్తారు. ప్రతి ఇంటా వినాయకుడి బొమ్మను వివిధ రకాలైన పుష్పాలు, పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు.

మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 

మహా దేవ సుతం గురుగుహ నుతం 
మహా దేవ సుతం గురుగుహ నుతం 
మార కోటి ప్రకాశం శాంతం 
మహా కావ్య నాటకాది ప్రియం 
మూషిక వాహన మోదక ప్రియం

“సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజ కర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిపః
ధూమ్ర కేతుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్రతుండఃశూర్పకర్ణ: హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నః తస్య నజాయతే.”

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

-మీ శ్వాస




కొత్తవలసలో స్వాతంత్రదినోత్సవ వేడుకలు - 2017

ఈ సంవత్సరం మన కొత్తవలసలో స్వాతంత్రదినోత్సవ వేడుకలు మన ప్రాధమిక పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్, పెద్దలు, ప్రజలు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, రెడ్ స్టార్ కుర్రవాళ్ళు అందరూ పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.


ముందుగా జెండావందనం చేసి, దేశ భక్తి గీతాలను విద్యార్ధులు ఆలపించారు. జెండావందనం తరువాత పాఠశాల లోపల నిర్వహించిన సభలో కొంతమంది పెద్దలు, ఉపాద్యాయులు, రెడ్ స్టార్ యువకులు స్వాతంత్రదినోత్సవ  విశిష్టతను విద్యార్దులకు వివరించారు. ఆ తరువాత పాఠశాలలో నిర్వహించిన ఆటలపోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా విద్యార్ధులకు స్కూల్ బ్యాగ్ లు, పుస్తకాలు, మిఠాయిలు మన శ్వాస ఆర్గనైజేషన్ తరపున అందజేయటం  జరిగినది.

ఇదేవిధంగా మన శ్వాస తరపున మనవంతు సహకారం అందించటానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

ఈ కార్యక్రమముకి సంబందించిన కొన్ని చిత్రాలను క్రింద గమనించగలరు...













అందరికీ స్వాంత్రదినోత్సవ శుభాకాంక్షలు...
ఇట్లు
మీ రెడ్ స్టార్ యూత్, కొత్తవలస
శ్వాస ఆర్గనైజేషన్


కొత్తవలస డ్యామ్‌పై ప్రమాదకర ప్రయాణాలు నీటిమట్టం పెరిగితే ప్రాణాలకే ముప్పు

వర్షాకాలంలో పది గ్రామాల ప్రజల అవస్థలు, కార్యరూపం దాల్చని వంతెన నిర్మాణం:


ఇక్కడ వర్షాలు పడే ప్రతిసారీ నీటి ప్రవాహం ఉదృతంగా ఉండటంతో కొత్తవలస, గెడ్డలుప్పి, డి.శిర్లాం, వెంకట భైరిపురం, వీరభద్రపురం, అంటివలస గ్రామస్థులకు ఇబ్బందులు తప్పట్లేదు. ప్రవాహంలోంచి బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగాలి. అయిదు గ్రామాల ప్రజల అవస్థలివి. సువర్ణముఖి నదిపై నిర్మించిన కొత్తవలస డ్యామ్‌పై ప్రమాదకర పరిస్థితులివి. సువర్ణముఖి నదిపై కొత్తవలస వద్ద సీతానగరం సాగునీటి ప్రాజెక్ట్‌ను నిర్మించారు. సీతానగరం, మక్కువ మండలాల తదితర గ్రామాల ప్రజల వ్యవసాయ పనులకు, మూడు మండలాల ప్రయాణికులకు ఇదే రహదారి కావడంతో నిరంతరం రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో డ్యామ్‌పై నుంచి నీరు ప్రవహించేటప్పుడు, అకస్మాత్తుగా నీరు ఎగువ నుంచి విడుదలైనప్పుడు ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 

నీటి ప్రవాహంలోంచి వచ్చే పాదచారులు, వాహన చోదకులు 50 మీటర్ల లోతులోని నదిలో పడి మత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఏటా వర్షాకాలంలో లెక్కలేనన్ని పశువులు కూడా నదిలో పడి మతి చెందుతున్నాయి. 

వర్షాకాలంలో నరకయాతన: వై.వాసుదేవరావు, కొత్తవలస, మాజీ సర్పంచ్

వర్షాకాలం వస్తే పనులు, నిత్యావసర సరుకుల కోసం బయటికెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నాం. డి.శిర్లాం– వెంకట భైరిపురం గ్రామాల మధ్య వంతెన నిర్మిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ప్రమాదాల నివారణకు సత్వరమే చర్యలు తీసుకోవాలి.   

కొత్తవలస డ్యామ్‌పై ఏటా ప్రమాదాలు: ఆర్.ఉమ, కొత్తవలస, సర్పంచ్

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. కొత్తవలస డ్యామ్‌ వద్ద ఏటా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు తక్షణమే వంతెన నిర్మించాలి.

వెంకటభైరిపురం–కొత్తవలస గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై వంతెనకు బడ్జెట్ పెంచాలి: డి.పరమహంస, సర్పంచ్, వెంకట భైరిపురం 

తక్షణమే ఈ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి: శ్వాస ఆర్గనైజేషన్ సభ్యులు, కొత్తవలస

అప్పట్లో చంద్రబాబు గారు 1999 లో ఎన్నికల ప్రచారానికి కొత్తవలస మీదుగా వచ్చినప్పటి నుండి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం, హమీ ఇవ్వటం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మక్కువ మండంలం వెంకటభైరిపురం–డి.శిర్లాం గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై వంతెన నిర్మించాలని అప్పటిమంత్రులు బి.సత్యనారాయణ, ఎస్‌.విజయ రామరాజు నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు సర్వే నిర్వహించి నదిలో బోర్లు వేయించారు. అనంతరం ఆ విషయం మరుగున పడింది. కనీసం  ఇప్పటి ప్రభుత్వమైనా ఈ పెద్ద సమస్యను చిన్నచూపు చూడకుండా త్వరితగతిన సమస్యను అర్ధంచేసుకుని, పనులు పూర్తి చేసి 3 మండలాల ప్రజల కష్టాలు తీరుస్తారని ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. 

కొత్తవలస, డి.శిర్లాం, గెడ్డలుప్పి గ్రామస్తుల తిప్పలు:  చుట్టుప్రక్కల ప్రజలు

బొబ్బిలి– మక్కువ బీటీరోడ్డులో బగ్గందొరవలస, వెంకట భైరిపురం కూడలి నుంచి కూతవేటు దూరంలో ఉన్న గెడ్డలుప్పి, కొత్తవలస గ్రామాల ప్రజల రాకపోకలు సువర్ణముఖీనదిలోంచి సాగుతాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొత్తవలస డ్యామ్‌ వద్ద రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. డ్యామ్‌పై నాచు చేరడంతో నడవలేకపోతున్నారు. డి.శిర్లాం, గెడ్డలుప్పి ప్రజల పరిస్థితి కూడా దారుణం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వర్తకులు డి.శిర్లాం-వెంకట భైరిపురం, గెడ్డలుప్పి–బగ్గందొరవలస గ్రామాల వద్ద సువర్ణముఖీ నది రేవులో ప్రమాదకరమని తెలిసినా విధిలేక నాటు పడవలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సమస్యలన్నీ, సువర్ణముఖినదిపై కొత్తవలస వద్ద ఇప్పటికైనా వంతెన నిర్మించి  పరిష్కరించాలని అన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

ప్రమాదాలను అరికట్టాలంటే, వంతెన ఒక్కటే మార్గం:  చుట్టుప్రక్కల విద్యార్ధులు, ఉద్యోగులు

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వర్తకులు డ్యామ్ వద్ద సువర్ణముఖీ నది రేవులో ప్రమాదకరమని తెలిసినా విధిలేక డి.శిర్లాం, గెడ్డలుప్పి నాటు పడవలో,  తక్కువ నీరు ఉన్నప్పుడు డ్యామ్ పైన ప్రమాదకర రాకపోకలు సాగిస్తున్నారు. సువర్ణముఖినదిపై కొత్తవలస వద్ద ఇప్పటికైనా వంతెన నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు, విద్యార్ధులు, ఉద్యోగులు, వర్తకులు అందరూ  కోరుతున్నారు.