దీపావళి శుభాకాంక్షలు


దీపావళి వెలుగుల పండగ. చీకటిలోంచి వెలుగుల్ని పుట్టించే పండగ. చెడుపై మంచి విజయాన్ని గుర్తు చేసే విజయకాంతుల పండగ. వెలుగుల్ని చిమ్మే దీపాలు ఆరోజు ఇంటా బయటా వరుసలు కడతాయి. మనలోని మనోతిమిరాన్ని పారదోలేలా ప్రకాశిస్తాయి.

జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని తోలుతూవెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

దీపావళి రోజున ఇంటిని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. శుచి, శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి.. మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల హారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.

దీపం జ్యోతి పరబ్రహ్మ 
దీపం సర్వతమోపహం 
దీపో హరతుమే పాపం 
దీపలక్ష్మీ నమోస్తుతే


దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటానడానికి అనేక కథలు చెప్తారు. అందులో ప్రధానమైనవి:
  • నరకాసుర వధ
  • బలిచక్రవర్తిరాజ్య దానము
  • శ్రీరాముడు రావణసంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మవటం (భరత్ మిలాప్) పురస్కరించుకుని
  • విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు

పూజ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ !
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వద !!

దీపాన్ని సూర్యుడి ప్రతిరూపంగానూ చెబుతారు. ఇలా దీపారాధన చేసేప్పుడు, దేవా... నేను వెలిగించిన ఈ దీపం నా ఒక్క ఇంట్లోనే కాదు మూడు లోకాలకూ వెలుగుల్ని పంచాలి. సర్వత్రా మంగళమే జరిగేలా చేయాలి... అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అవును...చీకట్లను పారదోలేదే దీపం. కాంతిని నింపేదే దీపం. అందుకే దీపావళినాడు అన్ని దీపాలను వెలిగిస్తారు. మంచి-వెలుతురు, చెడు-చీకటి. చెడు మీద మంచి విజయానికి గుర్తు దీపావళి.

దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
  1. ఇంటిధ్వారం.
  2. ధాన్యపుకొట్టు.
  3. బావి.
  4. రావిచెట్టు.
  5. వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఈ దీపావళి సందర్భంగా.. మనలో భయాల చీకట్లు తొలగిపోయి . స్వచ్ఛత, సచ్ఛీలత, సరైన సామాజిక విలువల పట్ల ప్రేమ, ధైర్యం ఇవన్నీ కోటి దీపాల కాంతులుగా ప్రభవించాలి. అప్పుడే మనకు నిజమైన దీపావళి కాగలదని ఆకాంక్షిస్తూ...

ప్రజలందరికీ ‘శ్వాస’ దీపావళి శుభాకాంక్షలు.