సంక్రాంతి ఆటలు - యువజన మైత్రికి బాటలు - ఆటలు, పాటలు, సరదాలు, సంతోషాలు


అచ్చ తెలుగుదనంతో అంగరంగ వైభవంగా మీ ముందుకు వస్తోంది మన శ్వాస సంక్రాంతి సంబరాలు 2018. రండి, తరలిరండి. ఈ సరదాల సందడిలో మీరు, మీ కుటుంబ సభ్యులు ఉత్సాహంగ పాల్గొనండి. కనువిందు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఆనందించండి.

సమయం వచ్చింది మిత్రమా... ఆటలు, పాటలు, సరదాలు, సంతోషాలు... తెచ్చే పండగ సమయం వచ్చేసింది!
కొత్త ఏడాదిలో వచ్చే తొలి పర్వదినం... సందడి మొదలవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు...

సంవత్సరంలొ ఎన్ని రోజులున్నా, కార్యక్రమాలు అవే. కానీ, పండుగల రోజులు ప్రత్యేకాలు వాటికవే. అందులో సంక్రాంతి అంటే మనకి ఇంకా ప్రత్యేకం..!!!


ముంగిట ముగ్గుల గొబ్బెమ్మలు, వాకిట హరిదాసులు,
బంతి పూల వాకిళ్ళు, పంట సిరుల నట్టిళ్ళు,
కన్నెపిల్లల ఆటలు, పసందైన గొబ్బి పాటలు,
కొత్త కుండలొ పొంగలు, కోడి పందాల సమరాలు,
కొత్త అల్లుల్లకు స్వాగతాలు, మరదళ్ళ పరాచికాలు,
పిండి వంటల సువాసనాలు, షడ్రుచుల విందులు.
పసుపు కుంకుమల పందారాలు, గ్రుహినులకెంతో సింగారాలు.
పుట్టింటి వారిచ్చు వాయనం, పద్ధతికెంతో సౌభాగ్యం.
కలకలలాడును - మన పల్లె సీమల లోగిల్లు,
తరతరాల మన సంస్కృతి ఆనవాల్లు.
పిల్లలు, పెద్దలు , బంధువులు, స్నేహితులు,
ఇల్లంతా సందడే సందడి, సంక్రాంతి ఒరవడి.
సంక్రాంతి పండుగ, సంబరాల వెల్లువ.

2017 సంవత్సరం నుండి  "సంక్రాంతి ఆటలు - యువజన మైత్రికి బాటలు" అనే నినాదంతో మన శ్వాస ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది.  మన గ్రామంలో యువత కోడిపందాలు, పేకాట వంటి వాటికి మొగ్గు చూపకుండా  ఇటువంటి ఆటల పోటీలు  నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. 

కబడ్డీ, షటిల్‌, ముగ్గులపోటీలు, పరుగుపందెం, మోపులాగుట, ఖో-ఖో, కుర్చీల ఆట, లెమన్ - స్పూన్, గడసరి అత్త - సొగసరి కోడలు, ఇంకా మొదలగు ఆటలు మరియు ముఖ్యంగా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి వ్యాసరచన, బొమ్మలు వేయటం, ప్రశ్నావినోదము, ఉపన్యాసం, పాటలు, నృత్యాలు వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులునివ్వనున్నారు.
ఆసక్తి గల వారు వారి పేర్లను సంబంధిత ఆటలకు నమోదు చేసుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి...

మరింత సమాచారం కోసం... 9581368528 / 9949671868 ఫోన్ నంబర్లకు లేదా మా contact@kothavalasa.in మెయిల్ ద్వారా సంప్రదించండి..

త్వరలో ఆటల పోటీల వివరాల జాబితా విడుదల చేస్తాం...




దీపావళి శుభాకాంక్షలు


దీపావళి వెలుగుల పండగ. చీకటిలోంచి వెలుగుల్ని పుట్టించే పండగ. చెడుపై మంచి విజయాన్ని గుర్తు చేసే విజయకాంతుల పండగ. వెలుగుల్ని చిమ్మే దీపాలు ఆరోజు ఇంటా బయటా వరుసలు కడతాయి. మనలోని మనోతిమిరాన్ని పారదోలేలా ప్రకాశిస్తాయి.

జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని తోలుతూవెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

దీపావళి రోజున ఇంటిని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. శుచి, శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి.. మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల హారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.

దీపం జ్యోతి పరబ్రహ్మ 
దీపం సర్వతమోపహం 
దీపో హరతుమే పాపం 
దీపలక్ష్మీ నమోస్తుతే


దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటానడానికి అనేక కథలు చెప్తారు. అందులో ప్రధానమైనవి:
  • నరకాసుర వధ
  • బలిచక్రవర్తిరాజ్య దానము
  • శ్రీరాముడు రావణసంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మవటం (భరత్ మిలాప్) పురస్కరించుకుని
  • విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు

పూజ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ !
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వద !!

దీపాన్ని సూర్యుడి ప్రతిరూపంగానూ చెబుతారు. ఇలా దీపారాధన చేసేప్పుడు, దేవా... నేను వెలిగించిన ఈ దీపం నా ఒక్క ఇంట్లోనే కాదు మూడు లోకాలకూ వెలుగుల్ని పంచాలి. సర్వత్రా మంగళమే జరిగేలా చేయాలి... అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అవును...చీకట్లను పారదోలేదే దీపం. కాంతిని నింపేదే దీపం. అందుకే దీపావళినాడు అన్ని దీపాలను వెలిగిస్తారు. మంచి-వెలుతురు, చెడు-చీకటి. చెడు మీద మంచి విజయానికి గుర్తు దీపావళి.

దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
  1. ఇంటిధ్వారం.
  2. ధాన్యపుకొట్టు.
  3. బావి.
  4. రావిచెట్టు.
  5. వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఈ దీపావళి సందర్భంగా.. మనలో భయాల చీకట్లు తొలగిపోయి . స్వచ్ఛత, సచ్ఛీలత, సరైన సామాజిక విలువల పట్ల ప్రేమ, ధైర్యం ఇవన్నీ కోటి దీపాల కాంతులుగా ప్రభవించాలి. అప్పుడే మనకు నిజమైన దీపావళి కాగలదని ఆకాంక్షిస్తూ...

ప్రజలందరికీ ‘శ్వాస’ దీపావళి శుభాకాంక్షలు.


వినాయకచవితి శుభాకాంక్షలు

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే !!!


ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటుంటాం. ఇందులో వినాయకుని తత్వం నిక్షిప్తమై ఉంది. ’శుక్లాంబరదరమ్’ అంటే తెల్లని ఆకాశం అని అర్థం. తెలుపు సత్వ గుణానికి సంకేతం. ’శుక్లాంబరధరం విష్ణుం’ అంటే సత్వగుణంతో నిండిన ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ’శశివర్ణం’ అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని అర్థం. ’చతుర్భుజం’ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నవాడని అర్థం. సర్వవిఘ్నాలను పోగొట్టే విఘ్ననివారకునికి మనసారా నమస్కరిస్తున్నానని ఈ శ్లోకం యొక్క అర్థం. విఘ్నాలను తొలగించి సత్వరఫలాన్ని, శుభములనిచ్చే శుభదాయకుడు గణపతి. హిందువులు జరుపుకునే సర్వశుభకార్యాలలోను విఘ్నేశ్వరుకే అగ్రపూజ.

విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున ఈ పండగను నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశేషమైన విశిష్టత వుంది. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. గణనాధుని కృప వుంటే మనకు అన్ని విజయాలే లభిస్తాయి. ఈ పర్వదిన ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. అనేకప్రాంతాల్లో గణపతి నవరాత్రులు నిర్వహిస్తారు. ప్రతి ఇంటా వినాయకుడి బొమ్మను వివిధ రకాలైన పుష్పాలు, పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు.

మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 
మహా గణపతిం మనసా స్మరామి 

మహా దేవ సుతం గురుగుహ నుతం 
మహా దేవ సుతం గురుగుహ నుతం 
మార కోటి ప్రకాశం శాంతం 
మహా కావ్య నాటకాది ప్రియం 
మూషిక వాహన మోదక ప్రియం

“సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజ కర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిపః
ధూమ్ర కేతుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్రతుండఃశూర్పకర్ణ: హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నః తస్య నజాయతే.”

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

-మీ శ్వాస




కొత్తవలసలో స్వాతంత్రదినోత్సవ వేడుకలు - 2017

ఈ సంవత్సరం మన కొత్తవలసలో స్వాతంత్రదినోత్సవ వేడుకలు మన ప్రాధమిక పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్, పెద్దలు, ప్రజలు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, రెడ్ స్టార్ కుర్రవాళ్ళు అందరూ పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.


ముందుగా జెండావందనం చేసి, దేశ భక్తి గీతాలను విద్యార్ధులు ఆలపించారు. జెండావందనం తరువాత పాఠశాల లోపల నిర్వహించిన సభలో కొంతమంది పెద్దలు, ఉపాద్యాయులు, రెడ్ స్టార్ యువకులు స్వాతంత్రదినోత్సవ  విశిష్టతను విద్యార్దులకు వివరించారు. ఆ తరువాత పాఠశాలలో నిర్వహించిన ఆటలపోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా విద్యార్ధులకు స్కూల్ బ్యాగ్ లు, పుస్తకాలు, మిఠాయిలు మన శ్వాస ఆర్గనైజేషన్ తరపున అందజేయటం  జరిగినది.

ఇదేవిధంగా మన శ్వాస తరపున మనవంతు సహకారం అందించటానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

ఈ కార్యక్రమముకి సంబందించిన కొన్ని చిత్రాలను క్రింద గమనించగలరు...













అందరికీ స్వాంత్రదినోత్సవ శుభాకాంక్షలు...
ఇట్లు
మీ రెడ్ స్టార్ యూత్, కొత్తవలస
శ్వాస ఆర్గనైజేషన్


కొత్తవలస డ్యామ్‌పై ప్రమాదకర ప్రయాణాలు నీటిమట్టం పెరిగితే ప్రాణాలకే ముప్పు

వర్షాకాలంలో పది గ్రామాల ప్రజల అవస్థలు, కార్యరూపం దాల్చని వంతెన నిర్మాణం:


ఇక్కడ వర్షాలు పడే ప్రతిసారీ నీటి ప్రవాహం ఉదృతంగా ఉండటంతో కొత్తవలస, గెడ్డలుప్పి, డి.శిర్లాం, వెంకట భైరిపురం, వీరభద్రపురం, అంటివలస గ్రామస్థులకు ఇబ్బందులు తప్పట్లేదు. ప్రవాహంలోంచి బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగాలి. అయిదు గ్రామాల ప్రజల అవస్థలివి. సువర్ణముఖి నదిపై నిర్మించిన కొత్తవలస డ్యామ్‌పై ప్రమాదకర పరిస్థితులివి. సువర్ణముఖి నదిపై కొత్తవలస వద్ద సీతానగరం సాగునీటి ప్రాజెక్ట్‌ను నిర్మించారు. సీతానగరం, మక్కువ మండలాల తదితర గ్రామాల ప్రజల వ్యవసాయ పనులకు, మూడు మండలాల ప్రయాణికులకు ఇదే రహదారి కావడంతో నిరంతరం రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో డ్యామ్‌పై నుంచి నీరు ప్రవహించేటప్పుడు, అకస్మాత్తుగా నీరు ఎగువ నుంచి విడుదలైనప్పుడు ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 

నీటి ప్రవాహంలోంచి వచ్చే పాదచారులు, వాహన చోదకులు 50 మీటర్ల లోతులోని నదిలో పడి మత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఏటా వర్షాకాలంలో లెక్కలేనన్ని పశువులు కూడా నదిలో పడి మతి చెందుతున్నాయి. 

వర్షాకాలంలో నరకయాతన: వై.వాసుదేవరావు, కొత్తవలస, మాజీ సర్పంచ్

వర్షాకాలం వస్తే పనులు, నిత్యావసర సరుకుల కోసం బయటికెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నాం. డి.శిర్లాం– వెంకట భైరిపురం గ్రామాల మధ్య వంతెన నిర్మిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ప్రమాదాల నివారణకు సత్వరమే చర్యలు తీసుకోవాలి.   

కొత్తవలస డ్యామ్‌పై ఏటా ప్రమాదాలు: ఆర్.ఉమ, కొత్తవలస, సర్పంచ్

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. కొత్తవలస డ్యామ్‌ వద్ద ఏటా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు తక్షణమే వంతెన నిర్మించాలి.

వెంకటభైరిపురం–కొత్తవలస గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై వంతెనకు బడ్జెట్ పెంచాలి: డి.పరమహంస, సర్పంచ్, వెంకట భైరిపురం 

తక్షణమే ఈ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి: శ్వాస ఆర్గనైజేషన్ సభ్యులు, కొత్తవలస

అప్పట్లో చంద్రబాబు గారు 1999 లో ఎన్నికల ప్రచారానికి కొత్తవలస మీదుగా వచ్చినప్పటి నుండి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం, హమీ ఇవ్వటం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మక్కువ మండంలం వెంకటభైరిపురం–డి.శిర్లాం గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై వంతెన నిర్మించాలని అప్పటిమంత్రులు బి.సత్యనారాయణ, ఎస్‌.విజయ రామరాజు నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు సర్వే నిర్వహించి నదిలో బోర్లు వేయించారు. అనంతరం ఆ విషయం మరుగున పడింది. కనీసం  ఇప్పటి ప్రభుత్వమైనా ఈ పెద్ద సమస్యను చిన్నచూపు చూడకుండా త్వరితగతిన సమస్యను అర్ధంచేసుకుని, పనులు పూర్తి చేసి 3 మండలాల ప్రజల కష్టాలు తీరుస్తారని ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. 

కొత్తవలస, డి.శిర్లాం, గెడ్డలుప్పి గ్రామస్తుల తిప్పలు:  చుట్టుప్రక్కల ప్రజలు

బొబ్బిలి– మక్కువ బీటీరోడ్డులో బగ్గందొరవలస, వెంకట భైరిపురం కూడలి నుంచి కూతవేటు దూరంలో ఉన్న గెడ్డలుప్పి, కొత్తవలస గ్రామాల ప్రజల రాకపోకలు సువర్ణముఖీనదిలోంచి సాగుతాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొత్తవలస డ్యామ్‌ వద్ద రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. డ్యామ్‌పై నాచు చేరడంతో నడవలేకపోతున్నారు. డి.శిర్లాం, గెడ్డలుప్పి ప్రజల పరిస్థితి కూడా దారుణం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వర్తకులు డి.శిర్లాం-వెంకట భైరిపురం, గెడ్డలుప్పి–బగ్గందొరవలస గ్రామాల వద్ద సువర్ణముఖీ నది రేవులో ప్రమాదకరమని తెలిసినా విధిలేక నాటు పడవలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సమస్యలన్నీ, సువర్ణముఖినదిపై కొత్తవలస వద్ద ఇప్పటికైనా వంతెన నిర్మించి  పరిష్కరించాలని అన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

ప్రమాదాలను అరికట్టాలంటే, వంతెన ఒక్కటే మార్గం:  చుట్టుప్రక్కల విద్యార్ధులు, ఉద్యోగులు

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వర్తకులు డ్యామ్ వద్ద సువర్ణముఖీ నది రేవులో ప్రమాదకరమని తెలిసినా విధిలేక డి.శిర్లాం, గెడ్డలుప్పి నాటు పడవలో,  తక్కువ నీరు ఉన్నప్పుడు డ్యామ్ పైన ప్రమాదకర రాకపోకలు సాగిస్తున్నారు. సువర్ణముఖినదిపై కొత్తవలస వద్ద ఇప్పటికైనా వంతెన నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు, విద్యార్ధులు, ఉద్యోగులు, వర్తకులు అందరూ  కోరుతున్నారు. 










మన ఊరి గోదారి !!!


మన ఊరి గోదారి...
మన పాడిపంటల కల్పవృక్షం...
మన అన్నదాతకు నీటి దాత...
మన దాహార్తిని తీర్చే... "సువర్ణముఖి"


మా సువర్ణముఖి తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి "సువర్ణముఖి"


నీ అందం వర్ణించలేనిది..
నీ కోపం శాంతించలేనిది..
నీ మనసు వెన్న... 
నీ చూపు చల్లని వెన్నెల...!!!


రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై సువర్ణముఖి తల్లి, జై సువర్ణముఖి తల్లి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


🙏


సంక్రాంతి సంబరాలు 2017



మన కొత్తవలసలో ఈ సంవత్సరం మన శ్వాస ఆర్గనైజేషన్ (రెడ్ స్టార్ యూత్) ఆధ్వర్యం లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకొన్నాం. మన సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరించడానికి వివిధ కార్యక్రమాలు, మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు సంప్రదాయ ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీల విజేతలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. పోటీలలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులను అందించారు.

ఈ సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా అంతా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండివంటల ఘుమఘుమలతో కొత్తవలసలో పండుగ శోభాయమానంగా జరిగింది. మకర సంక్రాంతి ప్రజలకు కొంగొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బంధాలను, మమతానురాగాలను ఇనుమడింప జేసింది. ఎక్కడ చూసినా పండుగ ఉత్సాహమే కనిపించింది. మహిళలు తెల్లవారుజామునే ముంగిళ్లలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. వాటిపై గొబ్బెమ్మలను పెట్టారు. సంక్రాంతి పండుగ శోభాయమానంగా జరిగింది. పిండివంటల ఘుమఘుమలు వాడవాడలా వ్యాపించి నోరూరించాయి. ఒకవైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు.. బోకాట జోరు.. బెట్టింగ్‌ల హోరు. . వీటికితోడు ప్రత్యేకమైన పిండివంటకాలు.

ఏడాదికి ఒక్కసారి మనందరం కలసి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ సంబరాలు ఏడాదంతా ఆనందంగా ఉంచాలని.., మన మనసులలో ఉండే కలతలను తొలగించాలని... ప్రతి ఏడాది ఇలా సంతోషంగా జరుపుకోవాలని... మన శ్వాస... ఆశ - ఆశయం 😊😊😊 మన రెడ్ స్టార్ యూత్ 🙆🙋🙌

సంక్రాంతి శుభాకాంక్షలు


మిత్రులందరికీ  ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.



భోగ భాగ్యాలను అందించే భోగి...,

పెద్దలను గుర్తుచేసే మకర సంక్రాంతి...,

కన్నుల పండుగగా సాగే కనుమ...,

నోరూరించే కమ్మని పిండి వంటలు...,

కవ్వించే కన్నెపిల్లల అందాలు...,

చిన్న పెద్ద తేడాలేకుండా ఆడే ఆటలు...



ఏడాదికి ఒక్కసారి మనందరం కలసి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ సంబరాలు ఏడాదంతా ఆనందంగా ఉంచాలని..మన మనసులలో ఉండే కలతలను  తొలగించాలని కోరుకుంటూ.......
                                                       మీ
                             రెడ్ స్టార్ యూత్[SVASA], కొత్తవలస

స్వామి వివేకానంద 154 వ జయంతి మరియు జాతీయ యువకుల దినోత్సవం


"యువతా మేలుకో.., ఇనుప కండలు.. ఉక్కునరాలే దేశానికి రక్ష. దేశ గతిని మార్చే శక్తి యువతకే  ఉంది" అంటూ ఉద్భోధించిన మహా మనిషి వివేకానంద. ఈ రోజు మన వివేకానందుడి జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం. ఇంకో విశేషమేమిటంటే ఈరోజు మన రెడ్ స్టార్ రెండవ ఆవిర్భావ దినోత్సవం.

మహా మనిషికి ముందుగా మన రెడ్ స్టార్ యూత్ తరపున జన్మదిన శుభకాంక్షలు.



"మతమంటే చర్చికిపోవటం కాదు. ముఖంమీద బొట్టుపెట్టుకోవటం కాదు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయో అన్నిరకాల రంగులతో మీ శరీరాలమీద రంగులు పూసుకోవచ్చుగాక. కానీ మీ హృదయం వికసించకపోతే, మీకు ఆత్మసాక్షాత్కారం జరగకపోతే  అంతా వ్యర్ధమే.మనిషిలోని దివ్యత్వాన్ని అభివ్యక్తపరచడమే మతమంటే". 

మూఢాచర మత్తులో జోగుతున్న భారతీయుల వీపులను చళ్లున చరచిన వ్యాఖ్యలవి. నిందారపణలతో, పరుషపదాలంతో అవతలి మతస్ధులను సమూలంగా ఉత్తరిస్తామంటూ బయలుదేరిన వాచాలుర కళ్లు తెరిపించాల్సిన మాటలివి. జాతి, మత, వర్ణ, వర్గ, కుల విభేదాలను అధిగమించి ఏకతాటిపై నిలిపే పంచాక్షరీ మంత్రం 'భారతీయత'. మనిషి జీవితంలోమానవత్వపు విలువలనుసుప్రతిష్టం చేయడమే మతాల సారం. హృదయంలో ప్రారంభమయ్యే  ఆ గుణాత్మక మార్పు మొత్తంగా మనిషి జీవిత సరళినే మార్చివేస్తుంది.

మనిషిని మానవోత్తముడిని చేయడం గురించే వివేకానందుడి తాపత్రయమంతా...!!!

మరికొన్ని వివేకానందుడి సూక్తులు...


"మంచి సేవకుడే మంచి నాయకుడు.."

"సవాళ్లని ధైర్యంగా ఎదుర్కో... అవి జీవిత పాఠాలు నేర్పే ప్రియనేస్తాలు.."


"ప్రపంచంలోకి వెలుగులు తీసుకురండి. వెలుగు మరిన్ని వెలుగులను విరబూయిస్తుంది. సర్వమనవాళీ తేజోవంతమై ప్రకాశిస్తుంది"


                                                                            మీ

                                                  రెడ్ స్టార్ యూత్[SVASA], కొత్తవలస