కొత్తవలస ఆనకట్టపై 3.5 మెగా వాట్ల ప్రాజెక్టు


ఆనకట్టలపై మినీ విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆనకట్టల నుంచి వస్తున్న వృథా నీటిని వినియోగించుకొని విద్యుత్తును తయారు చేసేందుకు ముందుకు వస్తున్నారు. వినియోగించిన నీరు మళ్లీ సాగుభూములకు వెళ్లేలా యోచన చేస్తున్నారు. ముఖ్యంగా చాలా ఆనకట్టలపై వీటిని నిర్మించాలని యోచన చేస్తున్నారు. విద్యుత్తు కొరతను అధిగమించే విధంగా ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది.


కొత్తవలస ఆనకట్టపై విద్యుత్తు ప్రాజెక్టు
 

సీతానగరం మండలం కొత్తవలస ఆనకట్టపై మినీ విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాదుకు చెందిన తుంగపాడు సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు 3.5 మెగావాట్ల విద్యుత్తును తయారు చేసేందుకు ఆయా సంస్థ డీపీఆర్‌ నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దిగువ ఆయకట్టుకు ఏమేరకు నష్టం ఉంటుందో అన్న అంశంపై పరిశీలన చేశారు. నీటి పారుదల పర్యవేక్షక ఇంజినీరు రమణమూర్తితో కూడిన ఇంజినీర్ల బృందం రెండురోజుల కిందట ఆనకట్ట వద్దకు వెళ్లి పరిశీలన చేసింది. ఆయా సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు.


నీటి లభ్యత ఇలా....! 

సీతానగరం ఆనకట్ట వద్ద వెయ్యి క్యూసెక్కుల నీరు లభ్యత అవుతోందని అధికారులు చెబుతున్నారు. వరదల సమయంలో మూడువేల క్యూసెక్కుల నీరు వస్తోందని అంచనా వేశారు. సువర్ణముఖి నీరు ఆనకట్టకు వస్తోంది. ప్రస్తుతం వంద క్యూసెక్కుల నీరు సాగునీటి కోసం వినియోగించగా మరో 100 క్యూసెక్కుల నీరు తాగునీటి అవసరాలకు ఖర్చవుతోందని అధికారులు లెక్కించారు. ఇంకా 800 క్యూసెక్కుల నీరు ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 3.5 మెగావాట్ల విద్యుత్తు తయారీకి సుమారు 200 క్యూసెక్కుల నీరు వరకూ అవసరమవుతోందని డీపీఆర్‌లో పేర్కొన్నారు.


పెదంకలాం ఆయకట్టుపై పునరాలోచన 

సీతానగరం ఆనకట్ట మిగులు నీరు పెదంకలాం ఆనకట్టకు చేరుతోంది. సీతానగరం ఆనకట్ట నుంచి మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పెదంకలాం నుంచి 7,500 ఎకరాల భూములకు సాగునీరు ఇవ్వాలి. కొత్తవలస వద్ద విద్యుత్తు ప్రాజెక్టు తలపెడితే దిగువ ఆయకట్టుకు ఎంతమేరకు నీరు అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా మళ్లీ సమగ్ర సర్వే చేపట్టాలని తలపెట్టారు. ఈ మేరకు ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చిన యాజమాన్యం కూడా మళ్లీ డీపీఆర్‌ను సమగ్రంగా తయారు చేయాలని నిపుణుల బృందం సూచించింది. నిర్మాణం జరిగాక నీరు లేకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు. దీంతో అధికారులు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు.


గోముఖి, సువర్ణముఖిపై నిర్మాణాలు 

గోముఖి, సువర్ణముఖి నదులపై సాలూరు మండలంలో విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తోణాం వద్ద గోముఖిపై, కురుకూటి వద్ద సువర్ణముఖిపై ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 3.5 నుంచి 5 మెగావాట్ల వరకు విద్యుత్తును ఆయా సంస్థలు తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ సీతానగరం ఆనకట్టపై నిర్మించేందుకు ముందుకు వచ్చారు. పెద్దగెడ్డ, జంఝావతిలపై కూడా విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించేందుకు సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పటికే సంబంధిత నిపుణులు వెళ్లి పరిశీలన చేశారు.


సాగునీటికి ఇబ్బంది లేకుండా....! 

విద్యుత్తు ప్రాజెక్టులతో సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలి. కొత్తవలస వద్ద విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి ఒక ప్రైవేటు యాజమాన్యం ముందుకు వచ్చింది. పరిశీలించాం. మళ్లీ డీపీఆర్‌ను తయారు చేసి తీసుకురమ్మని చెప్పాం. నిర్మాణంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


first published on @eenadu